Friday, 2 September 2016

హనుమంతుడి సందేశం

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

దృష్టి సోకడం అనేది నిజంగా ఉందా? (Drushti or Disti)

తలనొప్పి, కడుపునొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందునా పసి పిల్లలకు తరచూ దృష్టి సోకినట్లు భావిస్తుంటాం. ఉన్నట్టుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేక దిష్టి తగలడమేనా?

దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళని దిష్టి తగిలిన వ్యక్తికి నివాళించి మూడు దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు. ఇంకొందరు చెప్పు, లేదా చీపురుతో దిష్టి తీస్తారు.

విరగ్గాసిన చెట్లు, నిండా పండిన చేలు, సమృద్ధిగా పాలు ఇచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు లేదా భవంతి, కొత్తగా కొన్న వాహనం మొదలైన వాటికి కూడా దిష్టి తగులుతుందనే నమ్మకం ఉంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి. మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ కట్టడం, గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం, దిష్టిబొమ్మ వెళ్ళాడదీయడం, రాక్షసబొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేస్తుంటారు.
అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం లేదా చక్కగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగడం, పాడి పశువు పాలు ఇవ్వకపోవడం మొదలైనవి యాదృచ్చికంగా జరుగుతాయా లేక దృష్టి సోకడమే సిసలైన కారణమా? ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా లేక ఇది కేవలం మూఢనమ్మకమా?

దిష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్పారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢ నమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుందో చూద్దాం.

మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్నిసార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్తు కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్-రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి.
 
మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది.

కనుక వక్ర దృష్టి, ఈర్ష్యాసూయలతో కూడిన తీక్ష్ణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు.