Friday, 2 September 2016

భగవంతుడు వేలాది తలలు కలవాడు

భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.
మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.
భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.
ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.
భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.
ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.
మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).
ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.
ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.
అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.
బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి?
ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.
మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.
నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.
సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.
ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.
దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.
(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).
నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.
మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.
భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."
హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.
ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.