Thursday 10 September 2015

పండుగలు ఎలా పుట్టాయి?

indian_festival_image-2

           పండుగలు జరుపుకోవడం ప్రపంచమంతా ఉంది. రకరకాల పండుగలు రకరకాల కారణాలు, నేపథ్యాలు చెబుతూ జరపడం మామూలు దృశ్యమే. అసలు పండుగ అనే భావన సమాజంలో ఎలా తలెత్తింది? అది మానవుడ్ని ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.కొన్ని వందలు, వేల ఏళ్ళ క్రితం నుంచి సమాజంలో ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు క్రియా రూపాన్ని పొందిన ఫలితమే పండుగ అని ప్రముఖ పరిశోధకులు ఆర్వీయస్‌ సుందరం అంటారు. ప్రారంభంలో ప్రకృతి ఆరాధనగా ప్రారంభమై, వ్యవసాయ సంస్కృతి కాలంలో స్పష్టమైన రూపాన్ని పొంది, ఆ తరువాత మరింత క్లిష్టమైన రూపాన్ని సంతరించుకుని చివరకు ప్రాచీన ఆచారాల సూచికలుగా మనుగడలోకి వచ్చిన పర్వదినాలనే పండుగలుగా జరుపుకుంటున్నారు. అలాగే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకుంటూ చేసుకునేవీ పండుగలే. మహాత్ములు పుట్టిన రోజులు, దుష్ట సంహారం జరిగిన రోజులు ఇందుకు మంచి ఉదాహరణలు.నిజానికి పండుగలు ఎలా పుట్టాయి అనే విషయాన్ని ఇదమిత్థంగా చెప్పడం చాలా కష్టమైన పనే. నూటికి తొంభరు శాతం పండుగలు ప్రాచీన కాలపు కర్మకాండలను తెలియజేసేవే నని పండితుల అభిప్రాయం. మొదట మానవాతీత శక్తుల మీద విపరీతమైన నమ్మకం ఉన్న ఆదిమానవుడు తరువాత్తరువాత ఉత్సవ ప్రియుడై, తన ఆనంద విషాదాలను, ఇష్టాఇష్టాలను దేవునికి అంటగట్టి, దేవుని సంతృప్తి పరిచే వంకతో తనకు ఇష్టమైన వాటినన్నింటినీ చేయనారంభించాడు. ఈ విధంగా వచ్చినవే ఉత్సవ సంప్రదాయాలని కొందరంటున్నారు. సమస్యల వలయంలో చిక్కుకుని ఉండే మనిషి పండుగ నెపంతో తాత్కాలికంగా నైనా ఆటవిడుపు పొందడానికి, దేవునికి తన గోడు వినిపించి సాంత్వన పొందడానికి పండుగలు మంచి వేదికలయ్యాయి. వీలుంటే ఈ లోకంలో లేకుంటే పరలోకంలో నైనా తమకు కష్టాలు లేకుండా చెయ్యడానికి దేవునికి అనేక కర్మకాండలతో కూడిన పూజలు చేసి తృప్తిపొందడం మానవ నైజంగా మారింది. అందుకనే ఎంత యాంత్రికమైన జీవనాన్ని గడుపుతున్న వ్యక్తయినా పండుగ రోజున మాత్రం దేవునికి కేటాయించి మానసిక తృప్తిని పొందే ప్రయత్నం చేస్తాడు.
*దళితులను దూరం చేసిన మనువాదులు
ఎవరికి ఇష్టమొచ్చిన దేవున్ని వారు, ఏ పండుగను జరుపుకోవాలంటే ఆ పండుగను జరుపుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి సహజంగా ఉంటుంది.అయితే భారత దేశంలో ఈ పరిస్థితి లేదు. ఆదిమ యుగం నుంచి ఇనుప యుగం (అయో యుగం)లోకి ప్రవేశించిన అనంతరం మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తూ కుల వ్యవస్థ ప్రారంభమయింది. హిందువులు ఎంతో పవిత్రంగా భాంచే వేద పారాయణాన్ని పంచములకు నిషిద్ధమన్నారు. దేవాలయాల్లోకి వారు రాకూడదన్నారు. ఆ విధంగా భారతీయ సమాజంలో ఉత్పత్తి కులాల్లో ముఖ్యమైన వాటిని దేవునికీ, దేవుని పేర జరుపుకునే పండుగలకు దూరం చేశారు. రాకెట్‌ యుగంలోకి భారత దేశం దూసుకుపోతున్నా ఇంకా దేవాలయ ప్రవేశానికి నోచుకోని దళిత గ్రామాలెన్నో ఇక్కడ ఉన్నాయి. అదే సమయంలో సైన్స్‌ ఇంతగా అభివృద్ధి చెందినా ఇంకా పండుగలు పబ్బాల పట్ల అశాస్త్రీయ అవగాహనను కొనసాగిస్తూ ఎంతో సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చెయ్యడమే కాదు, ఎన్నో అకృత్యాలకూ అవకాశం కల్పించడం వర్తమానంలో కొనసాగుతున్న విషాదం!